మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను అల్లు అరవింద్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో అల్లు అరవింద్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఈ కార్యక్రమంలో బయటపెట్టారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ… గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. ‘ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు’ ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు.
మధ్యలో ఆలీ మాట్లాడుతూ.. పెళ్లయిన తర్వాత నిర్మలా ఆర్ట్స్ అని పెట్టవచ్చు కదా అని అల్లు అరవింద్‌ను అడిగారు. అయితే దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. మా గీత పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్‌జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు ‘గీత’ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు.. అని చెప్పారు.
ఇక గీతాఆర్ట్స్‌పై ఎన్ని సినిమాలు వచ్చాయో చెప్పనవసరం లేదు. నిర్మాణ విలువల్లో వెనకడుకూ వేయకుండా సినిమాలు తెరకెక్కించారు. ఈ సంస్థ పేరుతో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ టాక్ సాధించాయి. ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాయి. బాగా కలిసి వచ్చిన పేరుకావడంతో.. అందుకే అల్లు అరవింద్ ఆ పేరుతో సినిమాలు తెరకెక్కించి.. ప్రేక్షకులకు అందిస్తున్నారు.