గత ఏడాది ఆస్కార్ వేడుకల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన విల్ స్మిత్ చెంపదెబ్బ గుర్తుందా.. ఈ ఘటన జరిగి ఏడాది అయిపోయింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన కమెడియన్ క్రిస్ రాక్ తాను మాత్రం ఇప్పటికీ ఈ విషయాన్ని మరిచిపోలేకపోతున్నానని తనను ఎంతగానో బాధిస్తుందని చెప్పుకొచ్చారు..
గత ఏడాది జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో వ్యాఖ్యాత క్రిష్ రాక్ వ్యవహార శైలిపై మండిపడిన విల్ స్మిత్ అతనితో దురుసుగా ప్రవర్తించారు. వేదికపైనే క్రిష్ ను చంప దెబ్బ కొట్టడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన చూసిన వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన క్రిష్ ఆ ఘటన తనను ఇప్పటికీ ఎంతగానో బాధిస్తుందని తెలిపారు..
తాజాగా చెంప దెబ్బ సంఘటనపై స్పందించిన క్రిష్ రాక్.. “ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నాను. నన్ను అందరి ముందు అతను కొట్టాడు. ‘ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా..’ అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా.. ఆ దెబ్బ నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అయితే నేను బాధితుడిని కాదు. అందుకు నేనేమీ కన్నీళ్లు పెట్టుకోను..” అని చెప్పుకొచ్చారు..
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
గత ఏడాది జరిగిన ఆస్కార్ ప్రధానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు కమిడియన్ క్రిష్ రాక్. ప్రేక్షకుల్ని నవ్వించడానికి విల్ స్మిత్ భార్య జాడా పింకెంట్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమెకు ఉన్న అలోపేసియా అనే అనారోగ్యం కారణంగా గుండు చేయించుకోవలసి వచ్చింది. అయితే పూర్తి గుండుతో కనిపించిన ఆమెను క్రిస్ రాక్ జీ.ఐ.జేన్ చిత్రంలో డెమి మూర్ పోషించిన పాత్రతో పోల్చారు. ఈ మాటలతో సహించలేకపోయిన విల్ స్మిత్ నేరుగా వేదిక పైకి వెళ్లి క్రిష్ రాక్ ను చెంపదెబ్బ కొట్టారు.
కాగా ఈ ఘటన జరిగిన కొంత సేపటికే విల్ స్మిత్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అనంతరం అకాడమీ సభ్యులకు, సహచరులకు, ప్రేక్షకులకు తన క్షమాపణలు తెలిపారు. తన అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు విల్ స్మితను పదేళ్లపాటు ఆస్కార్ వేడుకలకు హాజరు అవ్వకుండా నిషేధం విధించారు.