గుడ్ న్యూస్‌.. భార‌త్‌లో ర‌ష్యా వ్యాక్సిన్‌ను విక్ర‌యించ‌నున్న రెడ్డీ ల్యాబ్స్‌..!

భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ శుభ‌వార్త చెప్పింది. ర‌ష్యాకు చెందిన స్పుత్‌నిక్‌-వి క‌రోనా వ్యాక్సిన్‌ను భార‌త్‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ విక్ర‌యించ‌నుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌కు గాను ఆ సంస్థే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను కూడా చేప‌ట్ట‌నుంది. తొలి విడత‌లో మొత్తం 10 కోట్ల డోసుల‌ను డాక్ట‌ర్ రెడ్డీస్ ఉత్ప‌త్తి చేయ‌నుంది.

doctor reddys to distribute russsia covid vaccine in india

ర‌ష్యాలోని గ‌మాల‌యా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌, ర‌ష్యా ర‌క్ష‌ణ విభాగం క‌లిసి సంయుక్తంగా స్పుత్‌నిక్‌-వి వ్యాక్సిన్‌ను రూపొందించిన విష‌యం విదిత‌మే. ఈ వ్యాక్సిన్‌కు గాను ర‌ష్యాలో ప్ర‌స్తుతం ఓ వైపు ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్నాయి. మ‌రో వైపు వ్యాక్సిన్‌ను అక్క‌డ ప్ర‌జ‌ల‌కు పంపిణీ కూడా చేస్తున్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ను ఇక‌పై భార‌త్‌లోనూ సర‌ఫ‌రా చేయ‌నున్నారు.

ర‌ష్యా స్పుత్‌నిక్ వ్యాక్సిన్ తయారీదారు ఆర్‌డీఐఎఫ్ ఈ మేర‌కు డాక్ట‌ర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. అయితే ఈ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో ఎప్ప‌టి నుంచి ట్ర‌య‌ల్స్ చేప‌డుతారు, ఎప్పుడు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తార‌న్న వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు.