అవును! ఈ మాట ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రాన్ని జగన్ మెప్పించి.. నిధులు ఇచ్చేలా ఒప్పించడం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులోనే ఏపీకి హామీ ఇవ్వడం చూశాక.. బాబు సాధించలేనిది.. జగన్ సాధించారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు హయాంలో పోలవరాన్ని కీలక ప్రాజెక్టుగా ప్రకటించడంతోపాటు ప్రతి సోమవారాన్ని ఆయన పోలవారంగా మార్చుకుని.. సమీక్షలు చేస్తూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.
దీనిని కేంద్రమే నిర్మించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో తానే చేపడుతున్నానని కూడా చెప్పుకొన్నారు. అంతేకాదు, ఇక్కడ జరుగుతున్న పనులపై కేంద్రానికి లెక్కలు చెప్పే విషయంలోనూ చంద్రబాబు సరిగా నివేదికలు ఇవ్వలేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు తిరిగి ఇచ్చే విషయంలో కేంద్రం మొండికేసింది. అంటే.. రాజకీయంగా చంద్రబాబు ఈ ప్రాజెక్టును వినియోగించుకుంటున్న విషయాన్ని కేంద్రం పసిగట్టిందని, అందుకే నిధులు బకాయిలు ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
నిజానికి అనుకున్న సమయంలో ప్రకారం జరిగి ఉంటే.. 2018 నాటికే ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావాల్సి ఉంది. కానీ, బాబు నిర్వాకంతో ప్రాజెక్టు పూర్తి కాకపోగా.. రాజకీయంగా కూడా ఆయన కేంద్రంలోని బీజేపీకి దూరమయ్యారు. నిధులు కూడా ఆయన హయాంలో ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు జగన్ సర్కారు.. వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలవరం ప్రాజెక్టు క్రెడిట్‌ను కేంద్రానికి కట్టబెడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖరాసింది. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ అడిగిన అన్ని పనులు, లెక్కలు చూపించింది.
దీంతో సంతసించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ఏపీకి రావాల్సిన 3 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని త్వరలోనే ఇస్తామని తాజాగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రకటన చేయించింది. ఈ పరిణామం చూసిన తర్వాత.. జగనా మజాకా.. బాబు సాధించలేనిది.. జగన్ సాధించారంటూ.. పోలవరంపై కామెంట్లు కురుస్తున్నాయి. మేధావులు సైతం ముగ్ధులవుతున్నారు.
-vuyyuru subhash