ఆ దేశాధినేతది మేకపోతు గాంభీర్యమేనా!

-

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం ఆ వైర‌స్ త‌మ దేశంలోకి ప్రవేశించ‌బోద‌ని మేకపోతు గాంభీర్యం ప్రద‌ర్శిస్తున్నాడు. వాస్తవానికి చైనాలో వైర‌స్ విస్తరిస్తున్న విష‌యం తెలియగానే దేశంలో కఠిన ఆంక్షలు విధించి ప్రజల్లో బయటకు వస్తే మరణమే అనే పరిస్థితులు కల్పించాడు కిమ్‌. అందుకే తమ దేశంలోకి వైరస్‌ ప్రవేశించలేదని ఆయన ధీమాగా ఉన్నాడు.

ఇదిలావుంటే వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచదేశాలకు శరవేగంగా పాకింది. ఇట‌లీ, ఇరాన్‌, స్పెయిన్, అమెరికా దేశాల‌పై ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నది. కానీ ఉత్తర‌కొరియాలో మాత్రం కరోనా చొరబడలేకపోయింది. కాదు కాదు, తమ దేశంలో కరోనా జాడలు లేవని ఉత్తరకొరియా ప్రభుత్వం తరచూ ప్రకటనలు చేస్తున్నది.

ఉత్తరకొరియా అధ్యక్షుడు, ప్రభుత్వం ప్రకటనలు ఇలా ఉంటే.. ఆ దేశంలో అస‌లు ప‌రిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయ‌ట‌. క‌రోనా మహమ్మారికి ఉత్తర కొరియా కూడా భయపడుతోందట. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేసే ప‌రిక‌రాలు, వైద్య స‌దుపాయాలు మెరుగుప‌ర్చడానికి సాయం చేయాలంటూ కిమ్ జోంగ్‌ ఇత‌ర దేశాల సాయం కోరడమే అందుకు నిద‌ర్శనమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌రోనా విష‌యంలో ఉత్తర‌కొరియా ప్రద‌ర్శిస్తున్నది మేక‌పోతు గాంభీర్యమేన‌ని తేలిపోయింది. ప్రపంచ‌ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా ఒక్క ఉత్తర‌కొరియాకు మాత్రమే పాక‌క‌పోవ‌డం అసాధ్యమ‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఉత్తరకొరియాలో కరోనా లక్షణాలు ఎవ‌రిలో క‌నిపించినా కాల్చి చంపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news