ఇటీవల కాలంలో అనగా కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాత కాలంలో జనాలు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి అలవాటు పడిపోయారు. జొమాటో, స్విగ్గీ ఇతర కంపెనీలకు ఆర్డర్స్ పెరిగినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇకపోతే కస్టమర్స్ ఆర్డర్ చేసే వాటిల్లో దాదాపుగా మస్ట్‌గా ఉండేది పిజ్జా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిజ్జా టేస్ట్ చేసిన ప్రతీ ఒక్కరు మళ్లీ మళ్లీ అదే ఆర్డర్ చేస్తూ ఉంటారు. అయితే, పిజ్జా ఆర్డర్ చేస్తే ఓ మహిళకు వెరైటీ అనుభవం ఎదురైంది.
పిజ్జాలో ఆమెకు తినే ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ వచ్చాయి. అవేంటంటే..బ్రిటన్‌కు చెందిన మిస్ బార్టన్ అనే మహిళ ఫుడ్ లవర్. ఆమె ఇటీవల కాలంలో బ్రిటన్‌లోని థార్న్ టన్ క్లీవ్లేస్ దగ్గర్లోని ఫ్లీట్ వుడ్ రోడ్‌లో ఉన్న డొమినోస్‌లో పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే, ఆ పిజ్జాను ఆమె అక్కడే తినకుండా ఇంటికి తీసుకెళ్లాలని భావించి ప్యాక్ చేయించుకుంది. అలా ఆమె కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎందుకో ఓపెన్ చేసి చూసింది పిజ్జాను.
అంతే.. అందులో ఉన్న ఐటమ్స్ చూసి షాక్‌కు గురైంది. ఆ పిజ్జాపై నట్లు, బోల్టులు వంటి ఇనుప సామగ్రి కనిపించింది. వెంటనే ఆ పిజ్జాకు సంబంధించిన ఫొటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు మహిళ. ఆ ఫొటోలను డొమినీస్ వారికి సోషల్ మీడియాకు ట్యాగ్ చేసి, అమౌంట్ రిఫండ్ చేయాలని కోరింది. స్పందించిన డొమినోస్ అవుట్ లెట్.. ఆమెకు క్షమాపణలు చెప్పడంతో పాటు సదరు పిజ్జాకు చెల్లించిన డబ్బును కూడా రిఫండ్ చేసింది. కాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిజ్జాను నిర్లక్ష్యంగా ప్యాక్ చేసిన అవుట్ లెట్ సిబ్బందిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.