వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక వివాదంలో ఇరుక్కున్నారు. అయితే అది అలాంటి ఇలాంటి వివాదం కాదు.. కరోనా వివాదం.. యెస్.. అవును.. ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు ప్రజలు కరోనాతో విలవిల్లాడుతుంటే.. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశం కోసమే వాడుకోవాలని, దాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తున్నారట. ఈ మేరకు జర్మనీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే అక్కడి పత్రిక డై వెల్ట్ కూడా ఈ విషయంపై ముందుగానే ఓ కథనాన్ని ప్రచురించింది.
జర్మనీలోని క్యూర్ వ్యాక్ అనే సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో చాలా వరకు పురోగతిని సాధించింది. వచ్చే జూన్ లేదా జూలై నాటికి మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్‌ను తెస్తామని వారు ప్రకటించగా, ఈ విషయాన్ని పసిగట్టిన ట్రంప్ సదరు కంపెనీకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఆ వ్యాక్సిన్‌కు పేటెంట్‌ను కొనుగోలు చేయాలని చూశారని, దీంతో ఆ వ్యాక్సిన్‌ను అమెరికాకే పరిమితం చేయడంతోపాటు దాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ట్రంప్ యత్నించారట. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లు క్యూర్ వ్యాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తో సమావేశమయ్యారు. దీంతో ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలు నిజమే కావచ్చని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కూడ ధ్రువీకరించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన జర్మనీ ప్రభుత్వం వ్యాక్సిన్ తమ దేశం నుంచి తరలివెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే క్యూర్ వ్యాక్‌కు కావల్సిన ఆర్థిక సహాయం తామే అందజేస్తామని జర్మనీ ప్రకటించింది.
కాగా డొనాల్డ్ ట్రంప్‌పై తాజాగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. అయితే దీనిపై ట్రంప్ ఏమని స్పందిస్తారో చూడాలి.