అమెరికా వైట్ హౌస్ బైట కాల్పులు జరగడం కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన రహస్య సేవల ఏజెంట్లు.. ట్రంప్‌ను మీడియా సమావేశం మధ్యలోనే ఆపి వేరే గదికి తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత మీడియా ముందుకు తిరిగొచ్చి తన ప్రసంగాన్ని కొనసాగించారు ట్రంప్. వైట్ హౌస్ వెలుపల కాల్పులు జరిగాయని, అనుమానితుడిని భద్రతా సిబ్బంది కాల్చినట్లు చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. నిందితుడు కాల్పులు జరిపేందుకు కారణాలు తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అనంతరం తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు ట్రంప్. అమెరికాలో ఇప్పటివరకు 6.5కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో మరే ఇతర దేశమూ తమ దరిదాపుల్లో కూడా లేదని పేర్కొన్నారు.ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి చైనానే కారణమని మరోమారు ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు. చైనా చెడ్డ దేశమని మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైతే నెల రోజుల్లోనే ఇరాన్‌తో ఒప్పందం ఉంటుందని చెప్పారు. చైనాతో మాత్రం ఒప్పందం ఉంటుందో లేదో తానేమీ చెప్పలేనని ట్రంప్ అన్నారు.