జియోకు ఇంటర్‌కనెక్టివిటీ సరిగ్గా ఇవ్వనందుకు గాను ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై మొత్తం కలిపి రూ.3050 కోట్ల ఫైన్ విధించారు.
టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. జియో వచ్చినప్పటి నుంచి ఇతర టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. జియో అందించే ఆఫర్లకు తట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ ఎయిర్‌టెల్ మాత్రం కస్టమర్లను కోల్పోకుండా ఉండేందుకు ఆ కంపెనీ కూడా జియో దారిలోకి వచ్చింది. జియోలాగే ఆఫర్లను ఇవ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ జియో ఇచ్చినట్లు ఏ ఇతర టెలికాం కంపెనీ కూడా ఆఫర్లను అందించలేదు. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ విషయంలోనూ అన్ని కంపెనీలు జియో కన్నా చాలా వెనుకబడి ఉన్నాయి. దీంతో జియో లాభాల బాట పట్టింది.
అయితే జియో రాకతో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు ఆ కంపెనీ యూజర్లకు కాల్స్ కనెక్టివిటీ సరిగ్గా ఇవ్వలేదు. జియో మార్కెట్‌ను దెబ్బ తీస్తుందని ఆరోపిస్తూ ఆ కంపెనీలు జియోకు ఇంటర్‌కనెక్టివిటీ ఇచ్చేందుకు నిరాకరించాయి. అయితే దానికి ఫలితంగా ఆ 3 కంపెనీలు ఇప్పుడు భారీ ఎత్తున ఫైన్ కట్టబోతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్) ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై భారీ జరిమానా విధించింది.
జియోకు ఇంటర్‌కనెక్టివిటీ సరిగ్గా ఇవ్వనందుకు గాను ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై మొత్తం కలిపి రూ.3050 కోట్ల ఫైన్ విధించారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు చెరో రూ.1050 కోట్లు, ఐడియా రూ.950 కోట్లు.. మొత్తం కలిపి రూ.3050 కోట్లను ఆ కంపెనీలు ఫైన్ రూపంలో చెల్లించాలి. జియో వచ్చిన ఆరంభంలో ఆ కంపెనీ సిమ్‌లను ఉపయోగించిన వినియోగదారులకు పెద్ద ఎత్తున కాల్ డ్రాప్స్ జరిగాయి. ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు చెందిన వినియోగదారులకు జియో సిమ్ నుంచి కాల్స్ చేసే అస్సలు కనెక్ట్ అయ్యేవి కావు. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున వినియోగదారులు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జియో కూడా పలు మార్లు ఈ ఇంటర్ కనెక్షన్ ఇష్యూపై ట్రాయ్‌కు కంప్లెయింట్ ఇచ్చింది. దీంతో విచారించి ట్రాయ్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై జరిమానా విధించాలని డాట్‌కు సూచించింది. అయితే ప్రస్తుతం ఆ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని.. అందువల్ల జరిమానా మొత్తాన్ని తగ్గించాలని కూడా ఆయా కంపెనీలు డాట్‌కు విజ్ఞప్తి చేయనున్నాయని సమాచారం. ఏది ఏమైనా.. ఈ విషయం పట్ల జియో మాత్రం చాలా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.!