రేపు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుందని ద్రౌపది ముర్ము తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని వివరించారు. “భారతదేశ జీడీపీ ఏటా పెరుగుతోంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు.
ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాం. చంద్రయాన్-3 జాబిల్లిపై కాలు మోపే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాం. 2047 లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి” అని ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు.