ఎండాకాలం రానే వచ్చింది. ఇప్పటికే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మండుటెండలో బయటికి వెళ్తే శరీరం ఒక్కసారిగా కందిపోతోంది. శరీరంలో నీటిస్థాయి, పోషకాలు తగ్గడంతో తొందరగా అలసటకు లోనవుతున్నాం. అందుకే ఎండకాలంలో జ్యూస్ ఎక్కువగా తాగాలని.. దీంతో మీకు ఇన్‌స్టెంట్ ఎనర్జీ దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కోల్పోయిన నీటి నిల్వలను, పోషకాలను కొన్ని రకాల పండ్లతో తిరిగి పొందవచ్చన్నారు. బయటికి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని.. శరీరం నిర్జలీకరణమైనప్పుడు తప్పనిసరిగా ఈ పండ్ల జ్యూస్ తాగాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ పండ్లెంటో.. వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం రండి.
పుచ్చకాయ..
సీజన్‌కు సంబంధం లేకుండా దొరికే ఫ్రూట్స్‌లో పుచ్చకాయ ఒకటి. దీనికి డిమాండ్ మాత్రం ఎండాకాలంలోనే పెరుగుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఎండలో దాహం తీర్చుకోవాలని అనుకుంటే పుచ్చకాయ జ్యూస్ తాగండి. దీంతో మీకు దాహం తీరడంతోపాటు తొందరగా శక్తిని చేకూర్చుతుంది. పుచ్చకాయ జ్యూస్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, సీ, బీ6 పుష్కలంగా ఉంటాయి. జట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపర్చడంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పుచ్చకాయలో ఉంటే పీచుపదార్థం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.
దోసకాయ..
ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లలో కీరాదోస ఒకటి. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. కీరాను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేయడం, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా చూడటం, ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు దోహదపడుతాయి. కీరలో ఫిసెటిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. ప్రతిరోజు కీరా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలు తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి, నీరు దొరుకుతుంది. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. పీచు పదార్థాలతోపాటు ఏ, సీ, బీ6, బీ9, ఈ, కే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ వంటి పోషకాలూ ఉంటాయి. ఈ పండ్లు తినడం వల్ల రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది. వీటితోపాటు కర్భూజ, బత్తాయి, ఫైనాపిల్ పండ్ల రసాలు శరీరానికి దాహం తీర్చడంలో తోడ్పడతాయి. వీటితోఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే వీటి జ్యూస్ తీసుకున్నప్పుడు జ్యూస్‌లో చక్కెర, ఐస్ వేసుకోకుండా తాగాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.