వాహనాలను నడిపేటప్పుడు ఫోన్లను వాడడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే సాధారణం కన్నా 4 రెట్లు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేందుకు అవకాశం ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే వారికి సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రూ.5వేలకు ఫైన్ లేదా 1 ఏడాది పాటు జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు. అయితే వాహనాలను నడిపేటప్పుడు ఫోన్లను మ్యాప్‌లు చూసేందుకు వాడవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లను డ్యాష్‌బోర్డ్‌కు ఫిక్స్ చేసుకోవడం ద్వారా వాటిలో మ్యాప్స్‌ను చూస్తూ డ్రైవింగ్ చేయవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఆ పని కోసం తప్ప ఇతర ఏ పనికీ ఫోన్‌ను డ్రైవింగ్ చేసేటప్పుడు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది వాహనం నడిపే సమయంలో ఫోన్‌లో కాల్స్ మాట్లాడుతున్నారని, కొందరు మెసేజ్‌లు పంపుకుంటున్నారని, దీని వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్లే సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై నిషేధం ఉందని తెలియజేసింది.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులు తమ వాహనాలు, తమకు చెందిన పత్రాలను డిజిటల్ రూపంలో ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే సరిపోతుందని, ఫిజికల్ డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం లేదని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రూల్‌ను అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నామని తెలిపింది.