’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు, అతని ఫ్యాన్స్, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఇన్ స్టాలో ఆర్యన్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. ’ దేవుడు ఉన్నాడు.. మీ ప్రేమ మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు‘ అంటూ ఇన్ స్టాలో స్టోరీని పోస్ట్ చేసింది.

 ఎట్టకేలకు దాదాపు 21 రోజుల అనంతరం జైలు నుంచి ఆర్యన్ బయటకి వస్తుండటంతో ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో ఎన్సీబీకి ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కింది కోర్టులు ఆర్యన్ కు బెయిల్ తిరస్కరిస్తూ వస్తున్నాయి. తాజాగా బాంబే హై కోర్ట్ బెయిల్ ఇచ్చింది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ తో పాటు మరో నిందితుడు అర్బాజ్ మర్చంట్ ముంబై లోని ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు మున్ మున్ దామేచా ముంబై బైకుల్లాలోని మహిళా జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి బెయిల్ రావడంతో శుక్రవారం లేదా శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.