మద్యం సేవిస్తే నిజంగా కొందరికి తాము ఏం చేస్తున్నామనే విషయం అర్థం కాదు. దీంతో కొన్ని సందర్భాల్లో అలాంటి వారు అనవసరంగా ఆపదలను కొని తెచ్చుకుంటుంటారు. సరిగ్గా ఆ వ్యక్తికీ అలాగే జరిగింది. పీకలదాకా మద్యం సేవించిన అతను వర్షం పడుతుండడంతో రెయిన్ కోట్ అనుకుని హాస్పిటల్‌లో ఉన్న పీపీఈ కిట్ తొడుక్కున్నాడు. దీంతో అతనికి కరోనా వచ్చింది.
నాగపూర్‌లో కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి గత వారం కిందట ఓ రోజు రాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఇంటికి వెళ్తుండగా.. దారిలో అనుకోకుండా ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడ్డాడు. అతన్ని గమనించిన స్థానికులు సమీపంలోని మేయో హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం అతన్ని తరలించారు. అయితే అదే మత్తులో అతను వర్షం నుంచి రక్షణ కల్పించుకోవచ్చని చెప్పి హాస్పిటల్‌లో ఉన్న పీపీఈ కిట్‌ను దొంగిలించాడు. దాన్ని అతను రెయిన్‌కోట్ అనుకున్నాడు.
అతని గాయాలకు చికిత్స చేసిన ఆస్పత్రి సిబ్బంది అతన్ని డిశ్చార్జి చేశారు. అయితే అతను తనతోపాటు ఆ పీపీఈ కిట్‌ను తెచ్చుకుని ధరించడం మొదలు పెట్టాడు. ఇరుగుపొరుగు వారు అది గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి ఆ వ్యక్తి ధరించి ఉన్న పీపీఈ కిట్‌ను తీసుకుని దాన్ని తగులబెట్టారు. ఇక ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. అతనికి పాజిటివ్ అని నిర్దారణ అయింది. అలా అతను మద్యం మత్తులో చేసిన తప్పుకు కరోనా వచ్చింది. దీంతో ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.