కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి పోయింది.. మళ్లీ ఉపాధి లభిస్తుందా, లేదా.. ఎలా బతకాలి.. జానెడు పొట్టను ఎలా పోషించాలి.. కుటుంబానికి ఎలా తిండి పెట్టాలి.. అన్న ఆందోళన.. భయం.. కనీసం సొంత ఊరికి వెళ్దామంటే.. చేతిలో సరిపోని చిల్లర.. రైళ్లలో వెళితే.. తిండికి కటకట.. వెరసి.. సగటు వలస కార్మికుడు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తాజాగా జరిగిన సంఘటన వలస కార్మికుల అసలైన బతుకు చిత్రాన్ని కళ్లకు కడుతుంది.
ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వలస కార్మికులను తీసుకెళ్తున్న శ్రామిక్ రైలు ప్లాట్‌ఫాంపై ఆగింది. అక్కడే ప్లాట్‌ఫాం మీద ఉన్న ఓ తోపుడు బండిపై చిప్స్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అక్కడ రైల్వే సిబ్బంది, పోలీసులు ఎవరూ లేరు. దీంతో ఆకలితో అలమటిస్తున్న కార్మికులు వాటిని తీసుకుని వెంటనే రైలెక్కేశారు. ఆ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే శ్రామిక్ రైళ్లలో కార్మికులకు తిండి, నీరు అందించడం లేదా.. అంటే.. ఇస్తున్నారు.. కానీ నాణ్యత లేని దిక్కుమాలిన ఆహారం పెడుతున్నారు. పాచిపోయిన తిండి వడ్డిస్తున్నారు. అందుకనే వారు తిండి కోసం అలా ఎగబడాల్సి వచ్చింది. పేదల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం ఇలాంటి సంఘటనలపై ఏమని సమాధానం చెబుతుంది ? ఇది వారు చేస్తున్న అభివృద్ధికి, చేపడుతున్న చర్యలకు నిదర్శనమా ? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.