ప్రస్తుత తరుణంలో టైలరింగ్ బిజినెస్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. మహిళలు స్వయంగా కుట్టు మెషిన్లను ఇండ్లలోనే పెట్టుకుని దుస్తులను కుడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే టైలరింగ్ షాపులు కూడా ఎక్కువే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారికి సూయింగ్ థ్రెడ్ రీల్స్ నిత్యం ఎంతో అవసరం ఉంటాయి. అయితే వాటిని తయారు చేసి అమ్మితే బోలెడు లాభాలు సంపాదించవచ్చు. మరి ఆ రీల్స్‌ను ఎలా తయారు చేయాలో, ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో, ఏ మేర అందులో సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
సూయింగ్ థ్రెడ్ రీల్స్ మేకింగ్ బిజినెస్‌కు కనీసం రూ.50వేల నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డబ్బు లేదనుకుంటే రూ.50వేలతో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంటే రూ.2 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పెట్టుబడి ఎక్కువ పెడితే.. లాభాలను కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. ఇక ఈ రీల్స్ తయారీ బిజినెస్‌ను స్థలం ఉంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఒక్కరు లేదా ఇద్దరు ఈ పనికి అవసరం అవుతారు.
ఈ బిజినెస్‌కు గాను ముందుగా ముడిపదార్ధాలను కొనుగోలు చేయాలి. దారం తయారీకి కావల్సిన యార్న్ (ఊలు) మార్కెట్‌లో కేజీకి రూ.260 నుంచి రూ.280 వరకు ఉంటుంది. అలాగే 1 కేజీ పేపర్ ట్యూబ్స్ ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉంటుంది. 1 కేజీకి దాదాపుగా 500 పేపర్ ట్యూబ్స్ వస్తాయి. ఇక తయారైన రీల్స్‌ను ప్యాక్ చేయాలంటే కావల్సిన బాక్స్ ప్యాకింగ్ లేబుల్ ఒక్కదాని ఖరీదు రూ.4 వరకు ఉంటుంది. ఒక బాక్స్‌లో 100 రీల్స్‌ను ప్యాక్ చేయవచ్చు. దీంతో ఖరీదు రూ.10 అవుతుంది. ఇక ఈ బిజినెస్‌కు గాను హ్యాంక్ టు కోన్ వైండింగ్ మెషిన్, రీల్ వైండింగ్ మెషిన్ లు అవసరం అవుతాయి. వీటిల్లో 3 హెడ్ మాన్యువల్ టైప్ మెషిన్ ధర రూ.35వేల వరకు ఉంటుంది. అదే 6 హెడ్ మాన్యువల్ టైప్ మెషిన్ ధర అయితే రూ.60వేల వరకు ఉంటుంది. ఇక ఆటోమేటిక్ అయితే ఇవే మెషిన్లు రూ.65వేలు, రూ.1.20 లక్షల వరకు ఖరీదు ఉంటాయి.
ఇక సూయింగ్ థ్రెడ్ రీల్స్‌ను తయారు చేయాలంటే ముందుగా సూయింగ్ థ్రెడ్‌ను యార్న్ నుంచి వైండింగ్ చేసుకోవాలి. తరువాత దాన్ని రీల్ వైండింగ్ మెషిన్ ద్వారా పేపర్ ట్యూబ్‌లకు చుట్టాలి. దీంతో సూయింగ్ థ్రెడ్ రీల్స్ తయారవుతాయి. వాటిని ప్యాక్ చేసి టైలర్లు, ఫ్యాన్సీ స్టోర్లు, దుస్తుల స్టోర్ల వ్యాపారులకు సరఫరా చేసి ఆ మేర ఆదాయం ఆర్జించవచ్చు. ఇక 1 కేజీ యార్న్‌కు 250 రీళ్లను తయారు చేయవచ్చు. రోజుకు 8 గంటల పాటు పనిచేస్తే 50 బాక్సుల రీళ్లను తయారు చేయవచ్చు. ఒక్కో బాక్సులో 100 రీళ్లు ఉంటాయి. అంటే 5వేల రీళ్లను రోజుకు తయారు చేయవచ్చన్నమాట.
ఇక ఒక బాక్సు రీళ్లను తయారు చేసేందుకు రూ.120 వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా మరో 20 నుంచి 40 శాతం మార్జిన్ వేసి మనం హోల్‌సేల్ వ్యాపారులకు, టైలర్లకు, ఇతర స్టోర్లకు రీళ్లను సరఫరా చేయవచ్చు. ఈ క్రమంలో ఒక్కో బాక్సుపై కనీసం రూ.24 వరకు లాభం పొందవచ్చు. నిత్యం 50 బాక్సులు అనుకుంటే.. 50 * 24 = రూ.1200 అవుతాయి. అదే నెలకు అయితే.. 30 * 1200 = రూ.36వేలు వస్తాయి. ఇలా సూయింగ్ థ్రెడ్ రీళ్లను తయారు చేసి చక్కని లాభాలను పొందవచ్చు..!