కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా టిష్యూ పేపర్లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గతంలో జనాలు వీటిని కేవలం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహారం తినేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం టిష్యూలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారు టిష్యూ పేపర్లను తయారు చేసి అమ్మడం ప్రారంభిస్తే చక్కని లాభాలు పొందవచ్చు.
టిష్యూ పేపర్ బిజినెస్‌కు కనీసం రూ.3.50 లక్షల పెట్టుబడి అవసరం. భారీ ఎత్తున కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దాంతో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ వ్యాపారం చేసేందుకు బ్యాంకులు లోన్లు కూడా ఇస్తాయి. రూ.3.10 లక్షలను బ్యాంకులు టర్మ్ లోన్ కింద ఇస్తాయి. అయితే గరిష్టంగా రూ.5.30 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ కింద లోన్ పొందవచ్చు.
ఇక కనీస పెట్టుబడితో బిజినెస్ ప్రారంభిస్తే ఏడాదికి ఎంత లేదన్నా 1.50 లక్షల కేజీల టిష్యూలను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్‌లో కేజీ టిష్యూల ధర రూ.65గా ఉంది. అంటే ఏడాదికి 1.50 లక్షల కేజీల టిష్యూలను ఉత్పత్తి చేస్తే కేజీ టిష్యూలకు ధర రూ.65 అనుకుంటే అప్పుడు టర్నోవర్ రూ.97.50 లక్షలు అవుతుంది. అందులోంచి ఖర్చులు తీసేసినా కనీసం 30 శాతం మొత్తం లాభంగా పొందవచ్చు. అంటే దాదాపుగా రూ.29 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే టిష్యూలను ఉత్పత్తి చేయడంతోపాటు మార్కెటింగ్ కూడా సరిగ్గా చేయాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో లాభాలను పొందవచ్చు.