విదేశాల్లో కాలేజ్ స్టూడెంట్స్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్‌లో ఓ భాగం. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్‌గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి.
అయితే ఇదే ట్రెండ్‌ను ఇప్పుడు భారత్‌లోనూ ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ). త్వరలోనే దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ‘నేర్చుకుంటూనే సంపాదించండి’ పథకం ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని యూజీసీ తెలిపింది.
ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లోని వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను యూజీసీ రూపొందించింది. వారానికి 20 గంటల పాటు నెలలో 20 రోజులు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని, అందుకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని నిర్ణయిస్తూ ముసాయిదా మార్గదర్శకాలను యూజీసీ తయారు చేసింది. విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు వీలుకల్పించే వాటి జాబితాలో రీసెర్చ్ ప్రాజెక్టులకు సహాయం పడటం, గ్రంథాలయాల్లో పనులు, కంప్యూటర్ సేవలు, డేటా ఎంట్రీ, ప్రయోగశాలల్లో చేయూతనందించడం వంటివి ఉన్నాయి.