మిజోరాం ఛాంపై జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. వరుసగా రెండోరోజు భూమి కంపించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించగా రిక్టర్ స్కేల్ తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. అంతకుముందు శుక్రవారం తూర్పు ఛాంపై ప్రాంతం నైరుతి దిశకు 35 కిలోమీటర్ల దూరంలో గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. ప్రకంపనల తీవ్రతకు 31కి పైగా నిర్మాణాలు దెబ్బతిన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మిజోరాంలో జూన్ 22 నుంచి తరచూ భూకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.