చైనాలో భారతీయ వైద్యుడి విగ్రహం ఏమిటని అనుకుంటున్నారా..? అవును మీరు చదువుతున్నది నిజమే. రెండో ప్రపంచయుద్ధకాలంలో చైనాలో వైద్యసేవలు అందించిన గొప్ప వైద్యుడు ద్వారకానాథ్ కోట్నిస్. ఈ దేశంలో ఆయనకు విశేషమైన గౌరవం ఉంది. ఆయన కాంస్య విగ్రహాన్ని వచ్చే నెలలో షిజియాజువాంగ్ నగరంలోని ఒక మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేయాలని చైనా అధికారులు నిర్ణయించారు. ద్వారకానాథ్ సొంతూరు మహారాష్ట్రలోని షోలాపూర్.
జపాన్ దురాక్రమణపై పోరాడుతున్న చైనా దేశ కమ్యూనిస్టుపార్టీ సైన్యానికి వైద్యసాయం అందించడానికి నాటి మన జాతీయనేతలు ఒక వైద్యబృందాన్ని అక్కడికి పంపించారు. ఇందులో ద్వారకానాథ్ కోట్నిస్ కూడా ఉన్నారు. 1938లో చైనాకు వెళ్లిన కోట్నిస్ 1942లో మరణించేవరకూ అక్కడే ఉన్నారు. అక్కడే చైనా యువతిని వివాహం చేసుకున్నారు. అయితే.. మరణించేనాటికి కొట్నిస్ వయస్సు 32 ఏళ్లే.