కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాలను వణికిస్తున్న భూకంపం.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 2.2 గా నమోదైందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువులో భారీ శబ్దాలతో భూ ప్రకంపనలు సంభవించాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లమీదికి పరుగులు పెట్టారు. ఒక పక్క కరోనా ధాటికి చచ్చి బతుకుతున్న సమయంలో ఇలాంటి విపత్తులు తలెట్టడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు.