TSPSC పేపర్ లీక్​ కేసులో.. చేతులు మారిన డబ్బుపై ఈడీ ఆరా

-

TSPSC పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ఈడీ అధికారులు సోమవారం విచారించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక నిధుల మళ్లింపుపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. అయిదు గంటలపాటు వీరిని ప్రశ్నించిన అధికారులు.. పేపర్ లీకే కేసులో నిధులు ఎవరెవరి చేతులు మారాయని అడిగినట్లు తెలిసింది. ఇవాళ కూడా వీరిద్దరిని ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు.

క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కనీసం రూ.40 లక్షలు చేతులు మారి ఉంటాయని భావిస్తోంది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ నిందితులు, లావాదేవీలు బయటపడుతున్నాయి. డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం ఖమ్మంలో ఓ యువతికి అందినట్లు, ప్రతిఫలంగా రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు లీకేజీపై కేసు నమోదు చేసిన నెల రోజుల తర్వాత తేలింది. ఇలాంటివి ఇంకా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇలాంటి లావాదేవీలపైనే ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్‌లోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి, లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణలను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించేందుకు న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకున్నారు. మొదటి రోజు సోమవారం మధ్యాహ్నం ఈ మొత్తం వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారిందనే అంశంపై ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news