ఎడిట్ నోట్: మళ్ళీ ‘బాబు’ బూచి.!

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు పేరు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో వినపడుతుంది. ఆయనని బూచిగా చూపించి మళ్ళీ కే‌సి‌ఆర్ రాజకీయం మొదలుపెట్టారా? అనే డౌట్ వస్తుంది. ఇటీవల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో మళ్ళీ చంద్రబాబు పేరు తీసి కే‌టి‌ఆర్ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అంటే చంద్రబాబు కాంగ్రెస్ అని అంటున్నారు. దీంతో మళ్ళీ బాబుని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ది పొందాలని బి‌ఆర్‌ఎస్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

గత రెండు ఎన్నికల్లో టి‌డి‌పి తెలంగాణ లో పోటీ చేసింది. చంద్రబాబు ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎక్కువ జోక్యం చేసుకున్నారు. ఓ వైపు ఏపీకి సి‌ఎంగా ఉంటూనే..తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కే‌సి‌ఆర్ కు చెక్ పెట్టాలని చూశారు. అయితే అంతకముందు కే‌సి‌ఆర్…తెలంగాణలో టి‌డి‌పిని లేకుండా చేయడమే టార్గెట్ గా పెట్టుకుని, ఆ పార్టీ నేతలని లాగేసుకున్నారు. అలా టి‌డి‌పిని దెబ్బతీయడంతో బాబు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలో దిగారు.

అప్పుడు అదిగో మళ్ళీ ఆంధ్రా బాబు తెలంగాణలో పెత్తనం చేయడానికి వస్తున్నారు. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం వస్తుందని కే‌సి‌ఆర్, బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేసి..బాబుని బూచిగా చూపించి ఆ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.  ఇక మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మొన్నటివరకు బి‌జే‌పిని టార్గెట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉంటూ బి‌జే‌పి..రాష్ట్రానికి ఏమి చేయడం లేదని విమర్శలు చేశారు.

కానీ ఈ మధ్య రాష్ట్రంలో బి‌జే‌పి గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక రేవంత్..బాబు మనిషి అన్నట్లు విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయం విషయంలో గతంలో బాబు దండగ అని అన్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచి..బషీర్ బాగ్ కాల్పులకు కారణమయ్యారని విమర్శిస్తున్నారు. బాబు వ్యవసాయం దండగ అంటే..ఛోటా చంద్రబాబు అయిన రేవంత్ వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారని విమర్శలు చేస్తున్నారు.

రేవంత్ సైతం..కే‌సి‌ఆర్ ఆ చంద్రబాబు దగ్గర నుంచే వచ్చారని, బషీర్ బాగ్ కాల్పుల సమయంలో కే‌సి‌ఆర్ టి‌డి‌పిలోనే ఉన్నారని, బాబు దగ్గర చెప్పులు మోశారని కౌంటర్లు ఇస్తున్నారు. అయినా బి‌ఆర్‌ఎస్ బాబు పేరు వాడుతూనే ఉంది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లేదని, అది జగన్..ఏపీకి తీసుకెళ్లాడని, ఇప్పుడు తెలంగాణలో బాబు కాంగ్రెస్ ఉందని కే‌టి‌ఆర్ విమర్శిస్తున్నారు.

ఇలా బాబు పేరు వాడుతూ మళ్ళీ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికి బి‌ఆర్‌ఎస్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. అయితే ఈ సారి బాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆయన దృష్టి ఏపీపైనే ఉంది. పైగా తెలంగాణలో టి‌డి‌పి యాక్టివ్ లేదు. మరి అలాంటప్పుడు బాబుని బూచిగా చూపడం వల్ల బి‌ఆర్‌ఎస్‌కు కలిసొస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version