ఎడిట్ నోట్ : వివాదంలో డిప్యూటీ సీఎం నారాయ‌ణ ! నారాయ‌ణ !

-

సారా ర‌హిత రాష్ట్రంగా కృషి..
రెండో సారి మంత్రి ప‌ద‌వి ఆశించ‌లేదు..
ఈ రెండూ పూర్తి విరుద్ధాలు.. కానీ ఈ రెండూ డిప్యూటీ సీఎం చెబుతున్న మాట‌లు. ఆయ‌న కార‌ణంగా సారా లేకుండా పోతే మంచిదే ! అదేవిధంగా స‌రిహ‌ద్దు ప్రాంతాలు అయిన ఒడిశా నుంచి అక్ర‌మ మార్గం లో చీక‌టి వ్యాపారం సాగ‌క‌పోతే మంచిదే ! దీనిని ఎవ్వ‌రూ కాద‌న‌రు కానీ ఆ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా అన్న‌దే ప్ర‌ధానం అయిన సందేహం ఒక‌టి టీడీపీ వినిపిస్తోంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చెప్పిన మాట‌ల ప్ర‌కారం మ‌ద్య నిషేధం అమ‌లు ఈ పాటికే కావాలి కానీ ఆ మాట మంత్రి చెబితే బాగుండేద‌ని కూడా విప‌క్ష స‌భ్యులు అంటున్నారు.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా మంత్రి నారాయ‌ణ స్వామి మాత్రం త‌న‌దైన శైలిలోనే ముఖ్య‌మంత్రిని ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ రోజు అసెంబ్లీలో ఈ రోజు బాధ్య‌త‌లు అందుకున్న త‌రుణంలో ఎప్ప‌టిక‌ప్పుడు స్వామి భ‌క్తి చాటుతున్నారు అని టీడీపీ మండిప‌డుతోంది. వీటి వ‌ల్ల ఏం ప్ర‌యోజ‌నం అని, నాటు సారా అమ్మ‌కాలు నియంత్రించి, క‌ల్తీ సారా ర‌వాణాను అడ్డుకుని, సంబంధిత అనైతిక వ్యాపారం చేస్తున్న వారిని నిలువ‌రించి మంత్రి త‌న కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు విప‌క్ష నాయ‌కులు. ఇవేవీ కాకుండా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కూ, పొగ‌డ్త‌ల‌కే ప‌రిమితం కావ‌డం ఏమంత మంచి ప‌రిణామం కాద‌ని హిత‌వు చెబుతోంది.

ఈ నేప‌థ్యాన దేవుడు ల‌క్ష‌ణాలు క‌లిగిన మాన‌వుడు జ‌గ‌న్ అని డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. నిన్నటి వేళ స‌చివాల‌యంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అందుకున్న స‌మ‌యంలో త‌న పేషీకి జ‌గన్ ప‌టంతో ఎంట్రీ ఇచ్చారు. సాధార‌ణంగా దేవుడి బొమ్మ‌తో వెళ్తారు కానీ త‌న‌కు దేవుడు జ‌గ‌నే అని అర్థం వ‌చ్చేలా స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు జ‌గ‌న్ ను మ‌రోసారి ఆకాశానికి ఎత్తేశారు. ఇవి కూడా ఇప్పుడు ప‌లు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.

న‌మ్మ‌కాలు, విశ్వాసాలు అన్న‌వి ఎవ‌రికి వారు నిర్ణ‌యించుకున్నవి లేదా ఎంపిక చేసుకున్న‌వి. వీటిపై ఎవ్వ‌రూ అభ్యంత‌రాలు చెప్ప‌రు కానీ మ‌రీ ! ప‌రిధి దాటి మాట్లాడితే వివాదాలే వ‌స్తాయి. జ‌గ‌న్ కూడా ఇదే అంటున్నారు..త‌న పేరిట అతి వ్యాఖ్య‌లు చేయ‌డం కానీ లేదా ప‌దవులు అందుకున్నారు క‌నుక అతి పొగ‌డ్త‌లు కుమ్మ‌రించ‌డం కానీ చేయ‌వ‌ద్ద‌నే అంటున్నారు. కానీ మంత్రులు మాత్రం అస్స‌ల‌స్స‌లు త‌గ్గ‌డం లేదు. రెండేళ్ల ప‌ద‌వీ కాలానికి సంబంధించి చాలా చోట్ల చాలా చ‌ర్చ న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో మంత్రులు మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోకుండా భారీ ర్యాలీల‌కు మాత్రం సిద్ధం అవుతుండ‌డ‌మే కాదు మోతాదు మించి జ‌గ‌న్ ను ఉద్దేశించి ప్ర‌శంసించ‌డ‌మే మీడియాలో హైలెట్ పాయింట్ గా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news