వచ్చే ఏడాది ఆరంభంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో ఒకటి లేదా రెండు నెలలపాటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది.
అయితే, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసెంబ్లీల కాల పరిమితి ముగియక ముందే రాజ్యాంగపరమైన అన్ని చర్యలను అనుసరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది.
వచ్చే ఏడాది మార్చి 15న గోవా, మార్చి 19 మణిపూర్, మే 14న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితి ముగియనున్నది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ కార్యదర్శితో ఎన్నికల కమిషన్ సోమవారం సమావేశమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇన్ఫెక్షన్ పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ ఆవశ్యకతపై సైతం ఎన్నికల సంఘం చర్చించింది.
అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నది. బలగాల మోహరింపుపై పారామిలిటరీ బలగాల అధిపతులతోనూ అధికారులు సమావేశం కానున్నారు.
ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని శుక్రవారం అలహాబాద్ హైకోర్టు కోరింది. ఎన్నికల ర్యాలీలు, సభలతోపాటు జనం ఒక్క దగ్గర చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి మోడీని సైతం అభ్యర్థించింది.
ఒకవేళ ఎన్నికల ర్యాలీలను ఆపకుంటే సెకండ్ వేవ్ కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని జస్టిస్ చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాణం ఉంటే అన్నీ ఉన్నట్లే అని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు మహమ్మారి వ్యాప్తికి కారణమయ్యాయని, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని ఉటంకించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా జరుగుతున్నయి. ఈ రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.