దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువ అన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటి ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 25 నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నట్టు సమాచారం.