ట్రెండింగ్ లో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు..వీటి కథేంటంటే…!

-

భారత్‌ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే వారిదే విజయం. కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలా కాదు. ప్రజల ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదు లెక్క.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయన్నదే అక్కడ లెక్క. అందుకే.. 2016 ఎన్నికల్లో ట్రంపు కన్నా హిల్లరీకి ఎక్కువ ఓట్లు వచ్చినా.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా దక్కించుకున్న ట్రంపే శ్వేతసౌధాధిపతి అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సంక్లిష్టమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల విచిత్రమమది. అన్ని రాష్ట్రాల మద్దతు ఉన్న అభ్యర్థే అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకుంది అక్కడి రాజ్యాంగం.

అమెరికాలో కొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్లకు, కొన్ని రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్నాయ్‌. ఎటూ మొగ్గని రాష్ట్రానే స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేవి ఆ రాష్ట్రాలే. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఒహాయో, మిచిగన్‌, నార్త్‌ కరోలినా, అరిజోనా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వవు. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 119 ఎలక్టొరల్‌ ఓట్లు ఉన్నాయ్‌. అక్కడ పోలింగ్‌ నువ్వానేనా అన్నట్లు ఉండడంతో ఓట్ల లెక్కింపు కూడా బాగా ఆలస్యమవుతుంది. 2016 ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడు రాష్ట్రాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేశారు. ఆ స్వింగ్‌ రాష్ట్రాల్లో ఫ్లోరిడాను ప్రత్యేకంగా చూస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. 1964 నుంచి ఆ రాష్ట్రాన్ని గెలుచుకున్న అభ్యర్థే అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరాక్‌ ఒబామా 2008, 2012లో ఇక్కడ విజయం సాధించారు. 2016లో ఫ్లోరిడావాసులు ట్రంప్‌ వైపు మొగ్గారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం ట్రంప్ వైపే మొగ్గు చూపింది.

Read more RELATED
Recommended to you

Latest news