వరుసగా చోటుచేసుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్ ల పేలుడు ఘటన లతో వాహనదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఇంధన పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లోని పెద్ద చీకోడు గ్రామంలో చార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనం లో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోయినప్పటికీ.. ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
పెద్ద చీకోడు లో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్ది రోజుల కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్నాడు. అయితే రోజూ మాదిరిగానే ఎలక్ట్రిక్ బైక్ ను ఇంటిముందు రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా బైక్ పేలి పెద్ద శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే పెంకుటిల్లు కావడంతో ఇంటికి మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన పాపానికి ఇంటినే కోల్పోయానని లక్ష్మీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.