తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం మాజీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే పార్టీ లో చేరుతున్నాం. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం” అని తెలిపారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పోలీసులకు సరెండర్ లీవులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “ఉద్యోగ సంఘాల నేతలు వైఎస్ జగన్ గారికి మద్దతుగా పార్టీలో చేరారు. ఎంప్లాయిస్ వింగ్‌ను బలోపేతం చేస్తాం. జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను మేము తీసుకుంటాం” అని పేర్కొన్నారు.