ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన ఇంగ్లండ్-భారత్ రెండో వన్డేలో టీమిండియా జట్టు ఊహించనిరీతిలో పరాజయం చవి చూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 247 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా పేలవంగా 38.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దాంతో.. 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్.. మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. గత మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 49 ఓవర్లలో 246 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (38), లివింగ్‌స్టోన్ (33)తో పాటు మొయిన్ అలీ (47), డేవిడ్ విల్లే (41) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
కెప్టెన్ జోస్ బట్లర్ (4), బెన్‌స్టోక్స్ (21), జో రూట్ (11), జేసన్ రాయ్ (23) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో యుజ్వేందర్ చాహల్ 4 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రాకి చెరో రెండు వికెట్లు దక్కాయి. 247 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభం నుంచి టీమిండియాది తడబాటే. కెప్టెన్ రోహిత్ శర్మ 10 బంతులాడి కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌కి చేరిపోగా.. శిఖర్ ధావన్ (9: 26 బంతుల్లో 1×4) క్రీజులో చాలాసేపు ఇబ్బంది పడి పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (16: 25 బంతుల్లో 3×4) మూడు చూడచక్కని బౌండరీలు బాదినా.. మళ్లీ పాత పాటే. ఇక రిషబ్ పంత్ (0: 5 బంతుల్లో) ఫుల్ టాస్ బంతిని సింపుల్‌గా ఫీల్డర్ చేతుల్లోకి కొట్టి వెనుదిరిగాడు.