త్వరలోనే BRS నేతలను అరెస్ట్ చేయబోతున్నారని మంత్రి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో సిబిఐ, ఈడీ, ఐటి కేసుల్లో బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తారని.. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. మహిళా దినోత్సవం కానుకగా కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచిందని.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోందని నిప్పులు చెరిగారు.
గ్యాస్ ధరలు తగ్గించకపోతే ప్రజలు మోడిని గద్దె దించుతారని.. తెలంగాణలో రైతులు పండించేది బాయిల్డ్ రైసే. కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే కొంటామని మొండికేస్తుందని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు పండించిన బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయకపోతే… తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. తెలంగాణ రైతాంగం యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదని.. ఎన్నికల ముందు 50 రూపాయలు తగ్గించి… ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ వందల రూపాయలు కేంద్రం పెంచుతుందని ఫైర్ అయ్యారు.