వరుసగా ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు ఈటల రాజేందర్. తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఆయన నిన్న, ఈ రోజు వరుసగా కాంగ్రెస్, బిజెపి, టీఆర్ ఎస్ అసంతృప్తులతో భేటీ అవుతున్నారు. అయితే ఎక్కడా అధికారికంగా తన భేటీపై స్పందించట్లేదు. కేవలం స్నేహపూర్వకంగానే సమావేశం అవుతున్నానని చెబుతున్నారు.
ఇక ఈ రోజు కూడా టీఆర్ ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్‌తో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన దాదాపు గంటన్నరసేపు చర్చించారు. అయితే ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కూడా ఈటల చర్చించారు.
ఆయనతో 20నిముషాల పాటు మాట్లాడారు ఈటల రాజేందర్. తన పోరాటానికి మద్దతివ్వాలని ప్రతిపక్ష నేతలను కలుస్తూ కోరుతున్నట్టు ఈటల రాజేందర్ తెలుపుతున్నారు. అయితే ఆయన భేటీ అవుతున్న నేతలందరూ ఇప్పుడు రాజకీయంగా అసంతృప్తిగా ఉన్న వారే కావడంతో.. వారందరినీ కలుపుకుని ఆయన ఓ కొత్త పార్టీ పెడతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకో వైపు బీజేపీలోకి వెళ్తారా అని కూడా చర్చసాగుతోంది. అయితే అసంతృప్తి నేతలను కలవడం వెనక కొత్త పార్టీ వ్యూహమున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై త్వరలోనే ఆయన ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.