ఈటెల రాజేందర్ సుధీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుండే ఉద్యమాల్లో ఉన్న చరిత్ర ఈటెలది. అన్న ఈటెల సమ్మయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న రాజేందర్ తెలంగాణ కోసం అంటూ గళమెత్తిన కేసీఆర్‌తో కలిసి నడిచారు. కేసీఆర్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్న సాన్నిత్యం కేసీఆర్ మనసేంటో ఎరిగిన ఈటెల ప్రతీది ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ చేస్తున్నాడనేది కనిపిస్తుంది. ఆయనను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చెయ్యగానే ప్రభుత్వం పై విరుచుకు పడి విమర్శలు చెయ్యలేదు. వ్యూహాత్మకంగా మాట్లాడుతూ, పక్కా ప్రణాళిక ప్రకారం తన అనుచరులను, నియోజక వర్గ కార్యకర్తలను కలిసి భవిష్యత్ ప్రణాళిక చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఏ ఇంటర్వ్యూ అయినా గాడి తప్పకుండా ఆలోచనాత్మకంగా విమర్శలు చేశారే కానీ ఎక్కడా సహనం కోల్పోలేదు. ప్రభుత్వం చేసిన మంచిపనులను కూడా ప్రస్తావించడం ద్వారా తన గొప్పదనాన్ని చాటుకున్నారు.
ఆయన తొలి ప్రెస్ మీట్ నుండి ఇప్పటి వరకు ఎక్కడా సొంత పార్టీ పెడతాననో, లేక కుల ప్రస్థావన లేకుండా యావత్ తెలంగాణా తనకు అండగా ఉంటుందంటూ చెప్పడంలో ఆంతర్యం గురించి మీడియా చర్చలు పెట్టిందే తప్ప ఎక్కడా ఈటెల సొంత పార్టీ అని మాత్రం చెప్పలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్నారేమో గానీ పరిస్థితులు రోజుల్లో మారిపోయాయి.. ఈటెలను ఎలాగైనా ఓడించాలనే విధంగా ప్రణాళికలు బాహాటంగానే కనిపిస్తుండటం.. నమ్మిన వారే దూరంగా వెళుతూ ఉండటం ఈటెలను ఆలోచనలో పడేసినట్లుగా కనిపిస్తుంది.
ఈ పరిణామాలన్నీ ఈటెలను వేరే పార్టీలోకి వెళ్లేవిధంగా చేశాయనడంలో సందేహం లేదు. ఇంకా ఈటెల స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరితో కలిసి ఉండే తత్వం ఈ రోజున రాజేందర్‌కి బాగా కలిసివస్తుందనే చెప్పాలి. టీఆర్ఎస్ నుండి వెలివేయబడిన వారిని, ఆ పార్టీ వ్యతిరేకులను ఒక్క తాటిపైకి తీసుకురావాలనేది ఈటెల అభిమతం.. ఆర్ఎస్‌యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా.. అందరితో కలసి యుద్ధం ప్రకటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఈటెల. ఇంక టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మంది ప్రజాప్రతినిధులు ఈటెల వెంట వచ్చే సూచనలు కూడా ఉన్నాయట.. అయితే అది ఇప్పటికిప్పుడు మాత్రం కాదట.. వచ్చే సార్వత్రిక ఎన్నిల్లోగా ఈటెల ప్రణాళిక ప్రకారం అంతా లనుకున్నట్లు జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం..