హుజరాబాద్ లో బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిరసన దీక్షకు దిగారు. చల్పూరు సర్పంచ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ నియోజకవర్గంలో పోలీసుల తీరుకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈటెల కార్యకర్తలతో కలిసి చేపట్టిన దీక్షలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో తనని ఓడించడానికి 600 కోట్లు పంచారని ఆరోపించారు.
ఆ డబ్బులని ఇప్పుడు మానేరు నదిలో ఇసుకను తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ తోడల్లుడికి తనుగుల, చల్లూరు లాంటి గ్రామాలలో ఇసుక క్వారీలను కట్టబెట్టి వందల కోట్ల విలువ చేసే ఇసుకని కొల్లగొడుతున్నారని అన్నారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుకపై ఎవరిని ఎంటర్ కానివ్వలేదని చెప్పారు ఈటెల. మానేరు నదిని చెరబట్టి కెసిఆర్ బంధువులు మెషిన్లు పెట్టి ఇసుకను తీసుకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ 8 ఏళ్లలో కేసీఆర్ కి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్ లో దళిత బిడ్డలందరికీ దళిత బంధు రాకపోతే కెసిఆర్ భరతం పడతామని హెచ్చరించారు.