ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులను ఆ స్థితి నుంచి తప్పించి వారి ప్రాణాలను కాపాడేందుకు గాను ప్రస్తుతం దేశంలో అనేక చోట్ల ప్లాస్మా థెరపీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని వల్ల ఎంతో మంది కోలుకుంటున్నప్పటికీ.. ఈ థెరపీ కోవిడ్ మరణాలను తగ్గించలేకపోతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలియజేసింది. ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్ మరణాల సంఖ్య తగ్గడం లేదని, అలాగే ఉందని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 39 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఏప్రిల్ 22 నుంచి జూలై 14వ తేదీ వరకు ప్లాస్మా థెరపీ చేయించుకున్న కోవిడ్ పేషెంట్ల వివరాలను ఐసీఎంఆర్ తెలుసుకుని వాటిని విశ్లేషించింది. ఈ క్రమంలో మొత్తం 1210 మంది కోవిడ్ పేషెంట్ల వివరాలను పరిశీలించగా.. వారిలో 34 శాతం మంది చనిపోయినట్లు ధ్రువీకరించింది. అయితే ప్లాస్మా థెరపీ కేవలం కొందరికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని, దీని వల్ల అందరినీ రక్షించలేమని ఐసీఎంఆర్ తెలిపింది.
ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్ ఎమర్జెన్సీ ఉన్నవారిని చాలా వరకు రక్షించవచ్చని, కానీ మరణాల రేటును తగ్గించలేమని ఐసీఎంఆర్ తెలిపింది. అయినప్పటికీ ఈ చికిత్సను కొనసాగించాల్సిందేనని అభిప్రాయపడింది.