సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించింది హైపవర్ కమిటీనా?.. పవర్ లేని కమిటీనా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి అనిత ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో అమరావతి ప్రాంత మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వారి శరీరాలు రక్తమోడుతున్నాయని… ఇంత మంది మహిళలను బాధిస్తున్న జగన్ పై దిశ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. మహిళలను కంటతడి పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మగాళ్లు లేరా? ఆడవాళ్లు వచ్చి ధర్నాల్లో పాల్గొంటున్నారని వైసీపీ నాయకురాలు ఒకరు అసభ్యకరంగా మాట్లాడారని… ఒక ఆడది అయ్యుండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
గుడికి వెళ్లే మహిళలపై కూడా జగన్ తన ప్రతాపం చూపిస్తున్నారంటే.. ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌గా లెక్కించాలని అన్నారు. విజయవాడలో మధ్యాహ్నం జరగబోయే మహిళా ర్యాలీకి ఎవరైనా హాజరవుతారనే భయంతోనే ఎక్కడికక్కడ మహిళలను అరెస్ట్ చేస్తున్నారని అనిత మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డీ… నీవు ఒక్క ఆడదానికి భయపడుతున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా… ఈ రోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టుకు వెళ్లే అంశాన్ని డైవర్ట్ చేయడానికే.. ఆడవాళ్లపై దాడి చేయిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.