బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగుల నియామక కుంభకోణం కేసులో తనతో పాటు అరెస్టయిన నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు.
కోల్‌కతా శివారులోని జోకాలో వైద్య పరీక్షల కోసం అధికారులు ఆయన్ను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకురాగా.. విలేకర్లతో మాట్లాడారు. అర్పితా ముఖర్జీ ఇళ్లలో ఈడీ జరిపిన సోదాల్లో దొరికిన డబ్బు తనది కాదన్నారు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అని విలేకర్లు అడగ్గా.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు.
గత వారం అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పార్థా ఇటీవల మాట్లాడుతూ.. ఈ కుట్రలో తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆ నిర్ణయం నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పార్థా.. ఈ కేసు నేపథ్యంలో తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ దీదీ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు.