- ఎఫ్1హెచ్2ఓ నిర్వహణకు మంత్రి వర్గ ఉప సంఘం
- ప్రతి పది రోజులకు ఒకసారి సిఎం సమీక్ష
- సమన్వయం కోసం సిఎస్ నేతృత్వంలో కమిటీ
- బెజవాడలో నవంబరు 16 నుండి 18 వరకు
- పర్యాటకం, జలవనరులపై ప్రత్యేక కార్యశాల
- ఉత్సాహభరితంగా సాంస్కృతిక కార్యక్రమాలు
అమరావతి: ఎఫ్1హెచ్2ఓ పవర్‌బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు నిర్ణయించారు. పర్యాటకం, జలవనరులు, పురపాలక, మత్స్య, ఆంతరంగిక శాఖ మంత్రులు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉండనున్నారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి, మంగళవారం మధ్యాహ్నం రెండు విడతలుగా సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. రెండు రోజుల పాటు జరిగిన సమీక్షా సమావేశాలలో సిఎం మాట్లాడుతూ ఎఫ్1 హెచ్2ఓ పవర్‌బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహణ ద్వారా ప్రపంచం దృష్టిని అమరావతి వైపు ఆకర్షింప చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి పది రోజులకు ఒకసారి తాను సమావేశం అవుతానన్నారు. సమావేశంలో తొలుత ఎఫ్1 హెచ్2ఓ పవర్ బోటు రేసింగ్‌కు చేస్తున్న ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు.
విజయవాడ ప్రకాశం జలాశయం వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు గాను ఒక్కో జట్టు నుంచి 50 సభ్యులు చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఒకేసారి లక్షమంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడియా ఇలా ఎవరికి వారికి ప్రత్యేక గ్యాలరీలు ఉంటాయని తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న హోటళ్లలో 4,500 గదులను బుకింగ్ చేసి వుంచామన్నారు. ఎఫ్1హెచ్2ఓ ఛాంపియన్‌షిప్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యాసంస్ధలలో పోటీలు నిర్వహించనున్నామని మీనా వివరించారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తూ ఏపీలో జల వనరులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా ఎఫ్1హెచ్2ఓ పవర్‌బోట్ ఛాంపియన్‌షిప్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించాలన్నారు. నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి ప్రపంచస్థాయి జల క్రీడల పోటీలను అంతా మెచ్చేలా ఘనంగా నిర్వహించాలని చెప్పారు.
కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో అంచనాలకు మించి జనం వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, రెండు, మూడు లక్షల మంది వచ్చినా సరిపోయేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిధులు, క్రీడాకారులు, పత్రికారంగానికి చెందిన వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈరోజు నుంచి ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపాలని చెప్పారు. ముఖ్యంగా యువత, విద్యార్ధులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక సిద్దం చేయాలని సిఎం స్పష్టం చేసారు. జల వనరులే రాష్ట్రానికి వరం, జల వనరులకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్న అంశాలను ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా చూస్తూ పోటీలకు అనుబంధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు, పోటీలు తిలకించేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా మన ఘనమైన వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబింపచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జలవనరులు, పర్యాటక ప్రాధాన్యం గురించి విద్యార్ధులకు అవగతం అయ్యేలా వివిధ పోటీలు పెట్టాలని, మూడు రోజుల పాటు కార్యగోష్టి నిర్వహించాలని తెలిపారు.
విజయవాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమీషనర్ నివాస్‌ను అదేశించారు. సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి హాజరు కాకపోవటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నదిని పూర్తి స్ధాయిలో పరిశుభ్రంగా ఉంచాలని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి స్ధానిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న మాలక్ష్మి గ్రూప్ ఛైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్, సిఇఓ మండవ సందీప్ మాట్లాడుతూ ఈ పోటీల కోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన అమరావతి టీమ్ మంచి శుభారంభాన్ని ఇచ్చిందని, ఇటీవల చైనాలో ముగిసిన పోటీలలో తృతీయ స్ధానాన్ని పొందగలిగామన్నారు. అమరావతిలో పోటీల నిర్వహణ తదుపరి అబుదాబిలో పోటీలు జరగనున్నాయన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ విజయభాస్కర్, శిల్పారామం ప్రత్యేక అధికారి జయరాజ్ పాల్గొన్నారు.
పర్యాటక రంగం పరంగా సంవత్సరాల తరబడి ముందంజలో ఉన్న కేరళ, రాజస్ధాన్‌లను పక్కన పెట్టి సమీకృత పర్యాటక అభివృద్దిలో ప్రధమ స్దానాన్ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వటం సంతోషదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఉత్తమ జాతీయ పర్యాటక’ పురస్కారం దక్కిందని పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా మున్ముందు ఏపీ ప్రపంచ పర్యాటకులకు గమ్యస్థానంగా మారాలన్న ఆకాంక్షను సిఎం వెలిబుచ్చారు. ఏపీలో అనేక పర్యాటక విశేషాలు ఉన్నాయని, సేవారంగంలో వృద్ధి గమనానికి పర్యాటకమే ప్రధాన ఇంథనమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. పర్యాటక అభివృద్ధికి వేగవంతమైన కృషి అవసరమన్నారు. సమావేశంలో ఎఫ్1హెచ్2ఓ పతాకాన్ని, క్రీడాకారులు ఉపయోగించే టీ షర్ట్‌ను సిఎం ఆవిష్కరించారు.