అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న పోస్టులు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ పోస్టులను తొలగించకుండా అలాగే ఉంచడం వల్ల జుకర్ బర్గ్ ఉద్యోగులు కన్నెర్ర చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను ఫేస్‌బుక్‌లో పెట్టరాదు. ఆ పనిచేస్తే ఫేస్‌బుక్ వాటిని తొలగిస్తుంది. అలాంటి యూజర్లను బ్లాక్ కూడా చేస్తారు. కానీ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా అలాంటి పోస్టులే పెడుతున్నప్పటికీ.. ఆ పోస్టులను తొలగించడం లేదు సరికదా.. వాటిని జుకర్‌బర్గ్ సమర్థిస్తుండడం ఆ సంస్థ ఉద్యోగులకే నచ్చడం లేదు. దీంతో జుకర్‌బర్గ్ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌కు భయపడుతున్నారంటూ.. పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అమెరికాలో మే 25వ తేదీన జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిపై ఓ తెల్లజాతి పోలీసు అధికారి దాడి చేసి అతని చావుకు కారణమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆ నిరసనల సెగకు బంకర్‌లో తలదాచుకున్నారు. అయితే.. ఫేస్‌బుక్‌లో మాత్రం ఆందోళనకారులను రెచ్చగొట్టే విధంగా ట్రంప్ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ పోస్టులపై స్పందించాలని జుకర్‌బర్గ్‌ను ఫేస్‌బుక్ ఉద్యోగులు అడగ్గా.. అవి తమ సంస్థ పాలసీలకు విరుద్ధంగా ఏమీ లేవని వారితో చెప్పాడు. ఆ పోస్టులను జుకర్‌బర్గ్ సమర్థించాడు. దీంతో ఫేస్‌బుక్ ఉద్యోగులు జుకర్‌బర్గ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జుకర్‌బర్గ్ సంస్థ పాలసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన తిమోతీ అవెని అనే ఓ ఇంజినీర్ ఈ వ్యవహారం నచ్చక తన జాబ్‌కు రిజైన్ చేశారు. మరొక కీలక ఉద్యోగి కూడా ఫేస్‌బుక్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
అయితే జుకర్‌బర్గ్ ఇలా ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఫేస్‌బుక్ పాలసీలకు వ్యతిరేకంగా వెళ్తుండడాన్ని ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను పెట్టేవారు ఎవరైనా సరే.. ఆ పోస్టులను తొలగించాల్సిందేనని.. అలాంటి యూజర్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. జుకర్‌బర్గ్ ఇలా వ్యవహరించడం సరికాదని వారు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు జుకర్ బర్గ్ భయపడుతున్నారేమోనని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి జుకర్‌బర్గ్ ముందు ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడో వేచి చూడాలి.