మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం..మోసం చేసేవాళ్లు పెరుగుతూనే ఉంటారు.. ఒక మార్గంలో దొరికిపోతుంటే వాళ్లు ఇంకో మార్గాలు ఎంచుకుంటున్నారు. ఫలితంగా అమాయక ప్రజలు వీరికి బలైపోతున్నారు. అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నానంటూ ఓ మహిళను కాదు వృద్ధురాలిని నమ్మించిన నకిలీ వ్యోమగామి.. కిందకు రాగానే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి భారీగా డబ్బు దండుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నా.. నీపై మనసుపడ్డా.. భూమ్మీదకు రాగానే నిన్ను పెళ్లిచేసుకుంటానంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆ వృద్దురాలి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు.. మోసపోయానని గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జపాన్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి సామాజిక మాధ్యమంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. రష్యాకు చెందిన వ్యోమగామిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నట్లు కొన్ని నకిలీ ఫొటోలను కూడా ఆమెకు షేర్ చేశాడు. ఆపై తరచూ ఇద్దరూ మెసేజ్‌లు చేసుకోవడంతో కొద్దిరోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఈ క్రమంలోనే.. ఆ నకిలీ వ్యోమగామి ఆమెతో తనను గాఢంగా ప్రేమిస్తున్నానని, భూమ్మీదకు రాగానే వివాహం చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. అయితే, తిరిగి భూమ్మీదకు రావాలంటే డబ్బు ఖర్చవుతుందని, జపాన్‌కు వెళ్లగలిగే రాకెట్‌కు ల్యాండింగ్ ఫీజు చెల్లించాలంటూ ఆమెను నమ్మించాడు. అతడి మాటలను నిజమని భావించిన వృద్ధురాలు 5 దఫాల్లో అతడు చెప్పిన ఓ ఖాతాకు 4.4 మిలియన్ యెన్‌లు (దాదాపు రూ.24.8లక్షలు) పంపించింది. అయినప్పటికీ మరింత డబ్బు అడగడంతో అనుమానంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అతడు నకిలీ వ్యోమగామి అని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు ‘అంతర్జాతీయ రొమాన్స్ స్కామ్’గా పేరు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
అసలు 65 ఏళ్ల వయసులో ఆమె పెళ్లిచేసుకోవాలనుకోవడం హైలెట్..వృద్ధురాలిని ప్రేమలో పెట్టి లక్షలు లక్షలు దోచేసుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. విషయం తెలిసిన నెటిజన్లు అసలు ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని వృద్దురాలినే కమెంట్ చేస్తున్నారు.!