ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకురాలు నీరజారెడ్డి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయారు నీరజారెడ్డి. కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాచుపల్లి లో కారు వెనక టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టైరు పేలిపోవడంతో కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
కానీ పరిస్థితి విషమించి ఆమె చనిపోయారు. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2011లో నియోజకవర్గంలో పనులు జరగడంలేదని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరి ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత అధికార పార్టీని వీడి ఆమె బిజెపిలో చేరారు.