ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 19 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు.
ఫిబ్రవరి 5 నుంచి తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉన్నందున పెద్ద ఎత్తున బొమ్మలు, గాజులు, పూజా సామగ్రిని వ్యాపారులు నిల్వ చేశారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జగ్గయ్యపేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఘటనాస్థలిని ఆలయ ఈవో, ఛైర్మన్, తహశీల్దార్ పరిశీలించారు.