పెట్రోల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. అయితే ఇప్పుడు పెట్రోల్ ధరలకు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే యాక్టివాను సీఎన్‌జీకి మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. దీంతో చక్కని మైలేజ్ వస్తుంది. అలాగే సీఎన్‌జీకి మార్చుకునేందుకు కూడా తక్కువ ధరే అవుతుంది.
హోండా యాక్టివా స్కూటర్‌ను వినియోగదారులు సీఎన్‌జీకి మార్చుకోవచ్చు. అందుకు గాను సీఎన్‌జీ కిట్‌ను లొవాటో అనే కంపెనీ అందిస్తోంది. దాని ధర రూ.15వేలుగా ఉంది. సీఎన్‌జీ కిట్‌ను అమర్చుకున్నప్పటికీ అందులో పెట్రోల్ కూడా పోయవచ్చు. అది ఎమర్జెన్సీలో పనికొస్తుంది. సీఎన్‌జీ కిట్‌లో 1.2 లీటర్ల సిలిండర్ ఉంటుంది. దాంతో 120 నుంచి 130 కిలోమీటర్ల వరకు తిరగవచ్చు. అనంతరం సిలిండర్‌ను రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా యాక్టివాను సీఎన్‌జీకి మార్చుకోవడం ద్వారా లీటర్‌కు 100 కిలోమీటర్ల మైలేజీ పొందవచ్చు. ప్రస్తుతం సీఎన్‌జీ ధర రూ.47 నుంచి రూ.48 మధ్య కొనసాగుతోంది.
అయితే సీఎన్‌జీకి మార్చిన తరువాత అందులో పెట్రోల్ మోడ్‌కు, తిరిగి సీఎన్‌జీ మోడ్‌కు మారేందుకు వీలుగా స్విచ్‌లను ఇస్తారు. దీంతో అందులో ఏది కావాలంటే ఆ ఇంధనాన్ని నింపవచ్చు. రోజూ 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగే వారికి ఈ ఆప్షన్ చక్కగా పనికొస్తుంది. లాంగ్ వెళ్లేవారు కూడా పెట్రోల్ ఆప్షన్ ఎలాగూ ఉంటుంది కనుక నిర్భయంగా ప్రయాణం చేయవచ్చు.