తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వరద నీటిలో నానా అవస్థలు పడ్డారు. అయితే, వరదల్లో నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.అంతేకాకుండా పరిహారం కూడా వారి ఖాతాల్లో జమచేసింది. ముందుగా ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాల బాధితుల ఖాతాల్లో బుధవారం డబ్బులు జమ చేసింది.
ఇల్లు డ్యామేజ్ అయితే రూ.16,500, గుడిసెలు కూలితే రూ.18,000 మంజూరు చేసింది. బుధవారం ఒక్కరోజే 15వేల మంది ఖాతాల్లో రూ.25 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న డబ్బులు జమ కానివారికి నేడు(గురువారం) అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ిదిలాఉండగా, భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మున్నేరువాగులో సైతం వరద ప్రవాహం తగ్గడంతో ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే భయాందోళన నుంచి బయటపడుతున్నారు.