గత వారం రోజులుగ ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. అయితే.. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ఉద్ధృతి వస్తుండడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 17.75అడుగులకు నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నుంచి పంట కాల్వలకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 18.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కోనసీమ జిల్లాలో ఇప్పటికే 37, పశ్చిమగోదావరి జిల్లాలో 13, తూర్పుగోదావరి జిల్లాలో 6 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. బ్యారేజీతోపాటు లంక గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లోని కంట్రోల్‌రూమ్ నుంచి విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షిస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పి.గన్నవరం, సఖినేటిపల్లి, అయినవిల్లి, అల్లవరం మండలాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, విపత్తుల నిర్వహణ బృందాలను పంపారు.