వజ్రాలు చాలా విలువైనవి. ఒక్క వజ్రమే కొన్ని లక్షల రూపాయల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుంది. అలాంటి 12వేలకు పైగా వజ్రాలను ఒక పువ్వు రూపంలో అమర్చితే..? దాని విలువ ఎంత ఉంటుందో ఊహించడమే కష్టం. అవును. సరిగ్గా అలాంటి వజ్రాల పువ్వునే ఓ భారతీయ వజ్రాల వ్యాపారి రూపొందించాడు. దానికి గిన్నిస్ బుక్‌లో చోటు కూడా లభించింది.
హర్షిత్ బన్సాల్ అనే 25 ఏళ్ల జ్యువెల్లరీ వ్యాపారి 12,638 చిన్న చిన్న వజ్రాలతో బంతి పువ్వు రూపంలో ఒక వజ్రాల పువ్వును రూపొందించాడు. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. సదరు పువ్వుకు అతను ది మేరీగోల్డ్ – ది రింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ అని పేరు కూడా పెట్టాడు. ఇక ఆ వజ్రాల పువ్వు బరువు 165 గ్రాముల వరకు ఉంది.
అయితే ఆ వజ్రాల పువ్వును కొందరు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ బన్సాల్ దాన్ని వారికి అమ్మేందుకు నిరాకరించాడు. ఆ వజ్రాల పువ్వును తయారు చేయడం తమ వ్యాపారానికి గర్వకారణమని, కనుక దాన్ని అమ్మే ఆలోచన లేదని అతను తెలిపాడు. కాగా ఆ వజ్రాల పువ్వులో మొత్తం 8 పొరలలో వజ్రాలను అమర్చారు. ఇక గతంలో 7,801 వజ్రాలతో రూపొందించిన రింగ్‌ను కూడా భారతీయులే తయారు చేశారు. దానికి కూడా గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది.