ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి మాజీ సీఎం జగన్ ఓ లేఖ రాశారు.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం.. సంప్రాదాయాలకు విరుద్ధం అని ఈ లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా అన్నారు. కూటమి, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.