అంగన్వాడీ బిల్డింగ్ పై పెచ్చులు పడి నలుగురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వెంకటాపూర్‌లోని అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరగా.. అందులోని చిన్నారుల విద్యాభ్యాసం కొనసాగుతోంది.
భవనానికి మరమ్మత్తులు చేయించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఫలితంగా నేడు బిల్డింగ్ గదిలోని స్లాబ్ పెచ్చులు ఊడి పడి నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులైన విద్యార్థులు అభిలాస్, మోనిక, హారిక, అంకితగా గుర్తించారు. ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.