హెర్బల్ ఆయిల్ అమ్ముతామంటూ మోసం.. రూ.52 లక్షలు స్వాహా..!

-

హెర్బల్ ఆయిల్ అమ్ముతామంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. ఏకంగా రూ.52 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్ బీ కాలనీకి చెందిన కొండల్ రెడ్డి వీఎస్ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ ద్వారా వివిధ సంస్థలకు అవసరమైన వస్తువులు, సామగ్రిలు సరఫరా చేస్తున్నాడు. అయితే కొండల్ రెడ్డికు ఆన్ లైన్ ద్వారా జుమాక్ ఫార్మాస్యుటికల్స్ ప్రతినిధినంటూ జాన్ డానియల్ పరిచయమయ్యాడు.

 

ఓ వ్యక్తి ఆక్సోనో హెర్బల్ ఆయిల్ కావాలని కొండల్ రెడ్డిని కోరాడు. దానికి కొండల్ రెడ్డి జుమాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చెప్పుకున్న వ్యక్తితో లావాదేవీలు నిర్వహించి కొండల్ రెడ్డి సదరు ఆయిల్ కొటేషన్ ను అతడికి పంపాడు. దీంతో వారు తొలివిడతా 500 లీటర్లు ఆక్సోనో హెర్బల్ ఆయిల్ కావాలని కొండల్ రెడ్డికి తెలియజేశాడు. దీంతో కొండల్ రెడ్డి జుమాక్ సంస్థతో సంప్రదింపులు జరిపాడు. ప్రతినిధులు సూచించిన విధంగా ఆ ఆయిల్ కోసం కొండల్ రెడ్డి మణిపూర్ లోని ఆర్.కే ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధిగా చెప్పుకున్న రాకేష్ కుమార్ ను సంప్రదించాడు. ఒప్పందం కుదరడంతో ఆయిల్ సరఫరాకు కొండల్ రెడ్డి రూ.42.63 లక్షలను రాకేశ్ బ్యాంక్ అనే వ్యక్తి అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు.

ఆర్డల్ పెట్టిన కొద్ది రోజుల తర్వాత ఆర్.కే ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధిగా చెప్పుకున్న హరిప్రీత్ కొండల్ రెడ్డికి కాల్ చేసి మరో రూ.10 లక్షలు పంపాలని, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందన్నాడు. దీంతో కొండల్ రెడ్డి మళ్లీ అతడి అకౌంట్ కి రూ.10 లక్షలు పంపించాడు. ఆయిల్ మూడు రోజుల్లో పంపిస్తామని చెప్పినా రాకపోవడంతో అనుమానం వచ్చి కొండల్ రెడ్డి ఆర్.కే ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులకు సంప్రదించాడు. కాగా రాకేశ్ కుమార్, హరిప్రీత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన కొండల్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news