స్వార్థం లేకుండా సృష్టించబడ్డది సృష్టిలో ఏదైనా ఉందంటే అది స్నేహమే. ఏమీ కానీ ఇద్దరు మనుషుల మధ్య పుట్టిన స్నేహంలో స్వార్థం అన్నదానికి తావెక్కడిది. నిజమైన స్నేహంలో స్వార్థం ఉండదు. స్నేహితులెప్పుడూ స్వార్థం గురించి ఆలోచించరు. అందుకే చిన్నప్పుడు ఎప్పుడో ఆటలాడిన మిత్రులు కనబడినా అమాంతం కళ్ళలోకి వెలుగు వచ్చేస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో స్నేహాన్ని మించినది ఏదీ లేదు. మరి ఈ స్నేహితుల దినోత్సవం Friendship Day రోజున అసలు స్నేహితులు ఎలా ఉండాలో చెప్పే కొన్ని అద్భుతమైన కొటేషన్లు తెలుసుకుందాం.
మన మాటల్లో ఇష్టాన్ని, కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే నిజమైన స్నేహితులు
గొప్పవాళ్లతో స్నేహం చేయాలనుకోవడం కాదు, స్నేహితులు గొప్పవాళ్ళు కావాలనుకోవడమే నిజమైన స్నేహం
ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలిపెట్టినపుడు నీతో ఉండేవారే నిజమైన స్నేహితులు
నలుగురిలో నువ్వున్నా నీతో నిన్ను లేకుండా చేసేది ప్రేమ అయితే, నీలో నువ్వు లేకున్నా నీతో పాటు ఉండేదే స్నేహం.
గోరంత బలహీనతను కొండంత పెద్దగా చూపేవారు చుట్టూ ఉంటారు. కానీ, గోరంత బలాన్ని కొండంత చూపేవారు కొందరే ఉంటారు. అలాంటి వాళ్ళు నీ స్నేహితులైతే నువ్వు అదృష్టవంతుడివే.
గతం ఎలా ఉన్నా భవిష్యత్తు బాగుంటుందన్న ఆశను కల్పించేవారే నిజమైన స్నేహితులు.
నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పేవారే నిజమైన స్నేహితులు
చిన్నప్పుడు ఆటపాటల్లోనే కాదు పెద్దయ్యాక ఆటుపోట్లలోనూ పక్కన ఉండేవారే నిజమైన స్నేహితులు.
ఒక విషయాన్ని వీరితో చర్చించాలా వద్దా అన్న అనుమానం ఒక్క క్షణం కూడా రాకుండా అవతలి వారితో మాట్లాడుతున్నావంటే వారు నీ నిజమైన స్నేహితులు అయి ఉంటారు.